
ఒంగోలు లో దక్షిణ కోస్తా జిల్లాల రొయ్యల రైతుల అసోసియేషన్ల (తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, గుంటూరు, కృష్ణా జిల్లా)లకు చెందిన జిల్లా నాయకులతో ఉమ్మడి సమావేశం ప్రకాశం జిల్లా రొయ్యల రైతుల సంఘం అధ్యక్షుడు దుగ్గినేని గోపీనాథ్ అధ్యక్షతన జరిగింది.
ఈ సమావేశంలో అమెరికా అద్యక్షుడు ట్రంప్ మన దేశం నుండి అమెరికాకు ఎగుమతి అయ్యే రొయ్యలపై వేసిన 50 శాతం టారిఫ్ వల్ల ఎదురయ్యే ఇబ్బందులను, ఆ ఇబ్బందులు నుండి రొయ్యల రైతులు ఏలా బయటపడాలి, దానికి ప్రభుత్వాల నుండి ఏ విధమైన సహాయ సహకారాలు అందాలో కూలంకుషంగా చర్చించడం జరిగింది.
అందరి అభిప్రాయాల ప్రకారం ట్రంప్ భారాలు నుండి రొయ్యల రైతులకు ఉపశమనం కలిగించి రొయ్యల సాగును ముందుకు తీసుకొని పోవుటకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ క్రింది చర్యలు తీసుకోవాలని వాటిని తీర్మానాలు రూపంలో ఏకగ్రీవంగా ఆమోదించారు.
తీర్మానాలు…
- రొయ్యల రైతులందరికీ సబ్సిడీతో ఎలాంటి అదనపు చార్జీలు లేకుండా విద్యుత్తును యూనిట్ కు రూ. 1.50 అందించాలి .
- తగ్గిన సోయా ధరలకు అనుగుణంగా రొయ్యల ఫీడ్ ధరలను కనీసం కిలోకు రూ. 15 కు తగ్గించాలి.
- రొయ్యల సాగులో ఉపయోగించే కెమికల్స్, మినరల్స్ ధరలను కనీసం 30శాతం తగ్గించాలి.
- రొయ్యల కనీస మద్దతు ధరను వెనామీ కి 100 కౌంట్ కు రూ.250లు,30 కౌంట్ కు రూ.400 లకు తగ్గకుండా, టైగర్ రొయ్యల 30 కౌంట్ కు ప్రకటించి ఎగుమతిదారులతో నేరుగా కొనుగోలు చేయించాలి, ధరలు తగ్గిన పరిస్థితుల్లో తగ్గిన ధరను ప్రభుత్వం బోనస్ గా రైతులకు చెల్లించాలి.
- ఎగుమతిదారులు తాము కొనుగోలు చేసిన రొయ్యలలో కనీసం 40 శాతం రొయ్యలను దేశీయంగా అమ్మే విధంగా ప్రభుత్వం చట్టం చేసి అమ్మించాలి.
- ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిపే స్కూల్స్, కాలేజీ హాస్టల్స్, అంగన్వాడి కేంద్రాలలో 15 రోజులకు ఒకసారి రొయ్యలను పుడ్ మెనూ లో చేర్చాలి.
- రొయ్యల రైతులకు 50% సబ్సిడీతో 1 కోటి రూపాయలు తో నిర్మితం అయ్యే విధంగా మినీ ప్రాసెసింగ్ ప్లాంట్లను డిజైన్ చేసి 50 శాతం సబ్సిడీ, బ్యాంకు రుణాలుతో ఏర్పాటు చేయించాలి.
- అమెరికా చైనా మార్కెట్లపై ఎగుమతుల కొరకు ఆధారపడకుండా ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, యూరప్ దేశాలకు ఎగుమతులపై ప్రభుత్వం దృష్టి సాధించాలి.
పై తీర్మానాల అమలు కోసం
రాష్ట్రముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, మత్స్యశాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి, 6 జిల్లాల పరిధిలోనీ రొయ్యల సాగు ఉన్న నియోజక వర్గాల శాసనసభ్యులను కలిసి పై తీర్మానాల అమలు కోసం కృషి చేయాలని నిర్ణయించడం జరిగింది.
ఇట్లు
దక్షణ ఆంధ్ర కోస్తా జిల్లాల
రొయ్యల రైతుల అసోసియేన్స్